తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?.. వెల్లడించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? ఎంత శాతం ఓట్లు వస్తాయి? అనే విషయాలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ తన అభిప్రాయం వెల్లడించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పార్టీల వారీగా ఇటీవల తాము నిర్వహించిన సర్వే వివరాలను బయటపెట్టారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక సీట్ల విషయానికొస్తే బీఆర్ఎస్కు 45 సీట్లు, కాంగ్రెస్కు 45, బీజేపీకి 7 , మజ్లిస్ పార్టీకి 7 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. మరో పదిహేను స్థానాల్లో గట్టి పోటీ కనిపిస్తోందన్నారు. గతంలో 24 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితిలో మరింత మార్పు వస్తుందని చెప్పిన ఆయన.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు.













