రేవంత్ రెడ్డికి భద్రత పెంచండి : హైకోర్టు
హాథ్‌సే హాథ్ జోడో యాత్ర చేపట్టిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అదనపు భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. తగిన భద్రత లేకపోవడం వల్ల పాదయాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముప్పు ఉందని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు 69 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అయితే ఆ భద్రత అంతా ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని రేవంత్ రెడ్డి న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రేవంత్‌రెడ్డికి భద్రత పెంచాలని స్పష్టం చేసింది. పాదయాత్రలో పాటు రేవంత్‌రెడ్డి రాత్రి బస చేసే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.













