బీజేపీ చెప్పిన చోటే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ : రాహుల్ గాంధీ
ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాంపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీ చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ ఎంపీల నివాసం నుంచి తనను వెళ్లగొట్టినా బాధపడలేదన్నారు. దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని బయటకి వచ్చినట్లు చెప్పారు. ఈడీ విచారణ పేరుతో తనను గంటల కొద్దీ కూర్చోబెట్టారన్నారు. బీజేపీ చెప్పిన చోటే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే టీమ్. వారు కలిసే పనిచేస్తారు. అవినీతిపరుడైన కేసీఆర్పై ఒక్క కేసు లేదన్నారు.
మోదీ ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. బీఆర్ఎస్కు ఓటేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం. కాంగ్రెస్ ఓటేస్తే ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయి. రూ.1200కు పెరిగిన గ్యాస్ సిలిండర్ను రూ.400కే అందిస్తాం. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఇస్తాం. యువ వికాసం పేరుతో విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం అని అన్నారు.













