దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలి : పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు, బస్సు ఛార్జీలు విపరీతంగా ఎందుకు పెంచారు? దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ ముసుగులో అప్పుల రాష్ట్రంగా మార్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ, బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. సిలిండర్ ధర పెంచితే టీఆర్ఎస్ నేతలు మోదీని విమర్శిస్తున్నారు. బహిరంగ సభ వేదికగా మోదీ రాజకీయ విమర్శలు చేయకపోవడం విషం చిమ్మడం ఎలా అవుతుందని అని ప్రశ్నించారు. సీజన్ ప్రారంభమైనా వ్యవసాయ ప్రణాళిక లేదు. మన ఊరు మన మడి అలంకార ప్రాయంగా మారింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ నిజాం నిరంకుశ పాలన సాగిస్తున్నారు. నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు. వ్యాపార సంస్థగా మారిందనే కాంగ్రెస్ పార్టీని వీడాను. మళ్లీ కాంగ్రెస్లోకి పోయేది లేదన్నారు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, అదో మునిగిపోయే పడవ అని అన్నారు.













