కేసీఆర్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..! ఇప్పుడే ఎందుకు..?
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించారు. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆయన తెలంగాణలో పర్యటించడాన్ని బట్టి ఇక్కడి ఎన్నికలకు వాళ్లు ఇస్తున్న ప్రయారిటీ అర్థమవుతోంది. మహబూబ్ నగర్ సభలో తెలంగాణపై వరాలు కురిపించిన మోదీ.. నిజామాబాద్ సభలో కేసీఆర్ పై సంచలన విషయాలు వెల్లడించారు. ఇన్నాళ్లూ కేసీఆర్ పై డైరెక్ట్ ఎటాక్ చేయని మోదీ.. ఇప్పుడు నేరుగా టార్గెట్ చేశారు. పైగా అంతర్గత విషయాలను మోదీ బయట పెట్టడం పెద్ద సంచలనానికి కారణమవుతోంది. ఎంతోకాలం కిందట జరిగినట్లుగా చెప్తున్న సంభాషణను మోదీ ఇప్పుడే ఎందుకు బయటపెట్టారనేది ఆసక్తి కలిగిస్తోంది.
నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా ఆయన విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ సీక్రెట్ కు మీకు చెప్తున్నాన్న మోదీ.. పలు అంశాలను వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిసి ఎంతో ప్రేమ ఒలకబోశారన్నారు. గతంలో ఎన్నడూ కేసీఆర్ అంత ప్రేమ చూపించలేదన్నారు. తన నేతృత్వంలో దేశం దూసుకుపోతోందని కేసీఆర్ చెప్పారన్నారు. తెలంగాణ పగ్గాలు కేటీఆర్ కు ఇస్తానని.. ఆశీర్వదించాలని కోరారన్నారు. ఎన్డీఏలో చేరతామని ప్రతిపాదించారని మోదీ చెప్పారు. అయితే ఇది రాజరికం కాదని కేసీఆర్ కు గట్టిగా చెప్ప్పినట్లు మోదీ వెల్లడించారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆరోజే చెప్పినట్లు తెలిపారు. ఎన్డీయేలో బీఆర్ఎస్ చేరేందుకు అంగీకరించలేదన్నారు.
ఇటీవలికాలంలో బీఆర్ఎస్ – బీజేపీ ఒక్కటేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చల్లబడిపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. దూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ని తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలివ్వడం.. అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారిపోవడం మనం చూస్తున్నాం. ఇదంతా బీఆర్ఎస్ కు మేలు చేసేందుకే జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ నిజామాబాద్ లో చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. మోదీ ఎప్పుడు తెలంగాణ వచ్చినా కేసీఆర్ స్వాగతించట్లేదు. ఆ విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.
అయితే మోదీ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మోదీ ఎన్నోసార్లు తెలంగాణలో పర్యటించారు. బహిరంగసభల్లో పాల్గొన్నారు. కానీ ఎప్పుడూ కేసీఆర్ మాటెత్తలేదు. పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే తొలిసారి కేసీఆర్ పై నోరు విప్పారు. అది కూడా ఘాటుగా. తమ మధ్య జరిగిన సంభాషణను ఇలా బయటపెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. ఒకరికొకరు సమావేశమైనప్పుడు చాలా అంశాలు మాట్లాడుకుంటూ ఉంటారు. సహజంగా అలాంటి వాటిని బయటపెట్టరు. అధికారిక సమాచారం ఏదైనా ఉంటే ప్రకటన ద్వారా విడుదల చేస్తుంటారు. కానీ పర్సనల్ మీటింగులో జరిగిన చర్చలను మోదీ ఇలా బయటపెట్టడం మాత్రం సంచలనం కలిగిస్తోంది.













