కేసీఆర్ ఆ హామీ ఏమైంది?.. బీజేపీ అధికారంలోకి రాగానే : మోదీ
బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని విస్మరించిందని విమర్శించారు. ఆ పార్టీ నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని చెప్పారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డును ప్రజలు చూశారు. బీజేపీ ఏం చెబుతుందో అది చేసి తీరుతుంది. ఆర్టికల్ 370తో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్, రైతులకు ఒకటిన్నర రెట్లు గిట్టుబాటు ధర, సైనికులకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్, రామ మందిర నిర్మాణం తదితర హామీలను నిలబెట్టుకున్నాం. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తామన్నాం.. ఇచ్చాం అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని సీఎంను చేస్తామని ప్రకటించాం. ఆ వర్గం నుంచి ప్రధాని సహా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసింది బీజేపీనే. తెలంగాణలోని పేదలు, మహిళలు, రైతులు, యువత, దళితుల ఆకాంక్షలను మా మేనిఫెస్టో ప్రతిబింబిస్తోంది. బీసీలు, దళితులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు. తెలంగాణ ఏర్పడగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఆ హామీ ఏమైంది? దళిత వర్గాలను ఆయన మోసం చేశారు. సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తోంది అని అన్నారు.













