ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన మోదీ
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందూరులోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచే రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రారంభించారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తొలి యూనిట్‌ను ప్రారంభించుకున్నట్లు చెప్పిన మోదీ, త్వరలోనే రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు రూ.4 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.













