రెండు పార్టీలు.. రాజకీయ ప్రయోజనాల కోసమే
తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల జీవితాలతో టీఆర్ఎస్, బీజేపీ చెలగాటం ఆడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సంతకం రైతుల పాలిట మరణశాసనంగా మారిందన్నారు. బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం గుదిబండగా మారిందని పేర్కొన్నారు. వడ్లను కనీస మద్దతు ధర రూ.1960తో కొనాలని డిమాండ్ చేశారు. కొన్న వడ్లను ఏం చేసుకుంటారో మీ ఇష్టమన్నారు. రైతులను మోసం చేయడానికి సమస్యను జఠిలం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ చెప్పలేదా? అని ప్రశ్నించారు.
మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం కుమ్మక్కు అయిందని, ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు మిల్లర్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. మిల్లర్లు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మద్దతు ధరను వరికి ప్రకటించిందా? లేక బియ్యానికి ప్రకటించిందా? అని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రం ఏం చేస్తాయో తెలియదు. వడ్లు మాత్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.













