రివేంజ్ తీర్చుకున్న జనసేన..!
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తెలంగాణ బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు తమను చులకన చేసి మాట్లాడారని పవన్ అన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవికి జనసేన మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. పార్టీతో సంబంధం లేకుండా పీవీ నరసింహారావు కుమార్తెగా గౌరవించి వాణిదేవిని సపోర్ట్ చేస్తున్నట్టు పవన్ వెల్లడించారు. సంస్కరణల ద్వారా పీవీ నరసింహారావు దేశాభివృద్ధికి రాచబాట పరిచారని.. అందుకే గౌరవంతో ఆయన కుమార్తెకు అండగా నిలుస్తున్నామన్నారు.
ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ప్రకటన చేయడం కలకలం రేపింది. వాస్తవానికి కొన్ని రోజుల ముందే జనసేనకు చెందిన శతఘ్ని విభాగం వాణిదేవికి ఓటేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ అనుమతి లేకుండా శతఘ్ని టీమ్ ఆ సాహసం చేసే ఛాన్సే లేదు. సోషల్ మీడియాలోని అధికారిక ఖాతాల్లోనే శతఘ్ని టీమ్ ఈ ప్రచారం మొదలు పెట్టడంతో జనసేన టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతోందని భావించారు. అయితే పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఓ వైపు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే వాణిదేవికి జనసేన మద్దతిస్తోందని పవన్ కల్యాణ్ ప్రకటించడం పెద్ద కలకలమే రేపింది.
అసలు జీహచ్ఎంసీ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీ ఏం చేసింది. జనసేనను ఎవరు చులకన చేసి మాట్లాడారు.. అనే అంశాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావించింది. పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పోటీ చేయాలనే డిమాండ్ వస్తోందని.. అందుకే పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నందున ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుంటారేమోనని భావించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను కలిశారు. దీంతో ఈ ప్రచారం ఊపందుకుంది.
జనసేన కూడా తమ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రెస్ రిలీజ్ చేసింది. కానీ జనసేనతో పొత్తును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అలాంటి ఆలోచన తమకు లేదన్నారు. ఓవైపు జనసేన తాము బీజేపీకి మద్దతిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కూడా.. కమలం శ్రేణుల నుంచి అలాంటిదేమీ లేదనే సమాధానం రావడం జనసైనికులకు ఆగ్రహం తెప్పించింది. కిషన్ రెడ్డి కేంద్ర పెద్దలే తమను మద్దతు కోరినప్పుడు.. రాష్ట్ర నేతలు దాన్ని గౌరవించకపోగా పట్టించుకోకపోవడాన్ని జనసేన అవమానంగా భావించింది. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిచ్చి జనసేన రివేంజ్ తీసుకుంది.













