గ్రేటర్ ఎన్నికల్లో పవనిజం పనిచేస్తుందా…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడంతో బిజెపిలో సంతోషం వ్యక్తమవుతోంది. పవన్ మద్దతు ఇవ్వడంతో వచ్చే ఓట్లు తమ విజయాన్ని మలుపు తిప్పే అవకాశాలు ఉంటాయని కమలనాథులు అంటున్నారు. పవన్ రాకతో తమ దశ తిరుగుతుందని, గెలుపు దిశగా దూసుకువెళతామని అంటున్నారు. పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్ వెనక్కితగ్గి బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ కోసం ప్రచారానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. అదే జరిగితే ఆంధ్ర సెటిలర్ల ఓట్లు తమకే వస్తాయని కమలనాథులు అనుకుంటున్నారు. గతంలో ఆంధ్ర సెటిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చినా.. విభజన తర్వాత చంద్రబాబు వచ్చినా పట్టించుకోలేదు. ఇక్కడ ఉండాలి కాబట్టే మంచిగా ఉండడమే బెటర్ అనుకుని టీఆర్ఎస్కే జై కొట్టారు. కాంగ్రెస్ వైపు చూద్దామన్నా నమ్మకం కుదరలేదు.
ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. పైగా బీజేపీ అండ ఉంటే టీఆర్ఎస్కు భయపడనక్కరలేదనే భావన నేతల్లో, ప్రజల్లోనూ వచ్చినట్లు కనబడుతోంది. అందుకే వారంతా బీజేపీకి ఓట్లు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారని, ఇప్పుడు వారిపై పవన్ కల్యాణ్ ప్రభావం పడితే తమకు ఓట్లు వచ్చిపడుతాయని బిజెపి నాయకులు అంటున్నారు.













