హైదరాబాద్‌లో కాన్సులేట్‌కు సొంత భవనం : హడ్డా
హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్‌కు సొంత భవనం నిర్మించేందుకు ఆ దేశ సర్కారు ఆమోదం తెలిపింది. నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 12.3 ఎకరాలను కేటాయించింది. హైదరాబాద్‌లో కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటై పదేళ్లవుతోంది. భారత్-అమెరికా మైత్రికి 70 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ స్థలంలో భవన నిర్మాణ శంకుస్థాపనకు కాన్సులేట్ జనరల్ సన్నద్ధమవుతోంది. 2021 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది.
రోజు 1500-2500 మందికి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా నూతన ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా తెలిపారు. ఒకేసారి 52 మందిని ఇంటర్వ్యూ చేసేందుకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుత కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహణ కేంద్రాలు పదే ఉన్నాయన్నారు. కాన్సులేట్ కార్యాలయంలో భారత్, అమెరికా తదితర దేశాలకు చెందిన సుమారు వెయ్యింది ఉద్యోగులు పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ భౌగోళిక స్వరూపాన్ని ప్రతిబింబించడంతో పాటు, పర్యావరణాన్ని పరిరక్షించేలా నిర్మాణం ఉంటుందన్నారు. నీటిశుద్ధి, సౌర విద్యుత్ ఏర్పాట్లుంటాయి. అమెరికా హరితభవన సమాఖ్య ప్రమాణాల మేరకు నిర్మాణం చేపడుతున్నాం. భారత్ అమెరికా కళాకృతుల కోసం శాశ్వత కేంద్రాన్ని నెలకొల్పుతాం. కళా నైపుణ్యాన్ని పంచుకునేందుకు ఇది ఉపకరించాలన్నదే మా ఆలోచన అని అన్నారు.













