ఆ ఇద్దరూ తోడు దొంగలే… జీవన్ రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ తోడు దొంగలేనని, ఆ తోడు దొంగల ఆటలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ కేంద్రం ఆదాయం కోసం ధరలు పెంచడమొక్కడే మార్గమా? విదేశాల్లోని నల్లధనం తీసుకురావొచ్చుగా? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ధర్నాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ పన్నులపై రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిస్కింలకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పెంచిన ధరల తగ్గింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం అవుతోందని ప్రకటించారు.













