ఇది తెలంగాణకు గ్వరకారణం : మంత్రి తలసాని
తెలంగాణ సంస్కృతికీ ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను నేడు అనేక దేశాల్లో నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో గల 358 దేవాలయాలకు ముంజురైన 2.13 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను ఆయా దేవాలయాల కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ప్రజలు గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహిస్తూ వస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉత్సవాల నిర్వహణ కోసం దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.













