అమెరికన్ ఇండియా ఫౌండేషన్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అమెరికాకు చెందిన అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (ఏఐఎఫ్) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (ఏఐఎఫ్) హైదరాబాద్ శాఖను నెలకొల్పడంతో భారత-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. భారత్లో తొలిశాఖను ప్రారంభించడానికి తెలంగాణను ఎంచుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని ఆయన పేర్కొన్నారు. ‘‘2001లో అప్పటి భారత ప్రధానమంత్రి వాజ్పేయి విజ్ఞప్తి మేరకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ చొరవతో ఈ సంస్థ ఏర్పడింది. అమెరికాకు, తెలంగాణకు విడదీయరాని బంధం ఉంది.
తెలంగాణలో 500కి పైగా అమెరికాకు చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వాటి భారీ ప్రాంగణాలు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉంది. శాస్త్ర, సాంకేతిక, జీవ వైద్య, ఏరో స్పేస్ రంగాల్లో ఇక్కడ పునాదులు బలంగా ఉన్నాయి. హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ మంజూరు చేస్తున్నన్ని విద్యార్థుల వీసాలు ప్రపంచంలోని మరే కాన్సులేట్ మంజూరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో భారత్లో ఏఐఎఫ్ మొదటి శాఖను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం గర్వకారణం. మహిళలు, చిన్నారుల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ఈ సంస్థ సేవలందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వారికి అవసరమైన సహాయ సహాకారాలను అందజేస్తుంది’’ అని తెలిపారు.













