ఫ్రెంచ్ పరిశ్రమలకు స్పెషల్ కారిడార్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు ఫ్రాన్స్ పర్యటనకు మంచి స్పందన
ప్యారిస్ పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ సెనేట్‌లో చేసిన కీలకోపన్యాసానికి వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుంచి విశేష స్పందన వచ్చింది. కేటీఆర్ ప్రసంగానికి సభికులు కరతాళ ధ్వనులతో స్పందించారు. పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన యాంబిషన్ ఇండియా`2021 బిజినెస్ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ చేసిన కీలకోపన్యాసం ప్రపంచవ్యాప్తంగా వివిధ నాయకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్‌లో కొవిడ్ అనంతర కాలంలో ’’ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం’’ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును వివిరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. కేటీఆర్ మాట్లాడుతూ జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధి అయితే, భారత సమాఖ్య నిర్మాణంలో రాష్ట్రాలు కూడా భూమి కేటాయింపు, ఆమోదం, అనుమతులు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి అంటూ, తెలంగాణలో గత ఏడేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను కేటీఆర్ సెనేట్ వేదికగా ప్రస్తావించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులకు సూచిస్తూ వారిని తెలంగాణకు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెంచ్ కంపెనీలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధ్రువీకరణను అనుమతిస్తుందని, చట్టం ప్రకారం 15రోజుల్లో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్ లభిస్తుందన్నారు. ఈ 15 రోజుల వ్యవధిలో అనుమతుల జారీ జరగకపోతే 16వ రోజున పూర్తి అనుమతులు లబించి ఆమోదించినట్లు భావించవచ్చని స్పష్టం చేశారు. తెలంగాణకు టీఎస్ఐఐసీలో 200 వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందని, విద్యుత్, నీరు, అత్యుత్తము మౌలిక సౌకర్యాలను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ సందఠరేగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌ను కేటీఆర్ హైలైట్ చేస్తూ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో శిక్షణనిచ్చి, వారిని నాణ్యమైన మానవ వనరులుగా మారుస్తుందన్నారు. ఇది స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏ కంపెనీ అయినా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇతర రాష్ట్రాలు ఆఫర్ చేస్తున్న అంశాల కంటే తాము ఎక్కువ ఆఫర్ చేస్తామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించి తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు ఫ్రెంచ్ సెనేట్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
సీఈవోలతో భేటీ
పారిస్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం వరుసగా రెండోరోజు కూడా పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్క్రెజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఈడీఈఎఫ్) డిప్యూటీ సీఈఓ జెరాల్డిన్తో జరిగిన భేటీలో ఫ్రెంచ్ ఎస్ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సహకారాన్ని కేటీఆర్ వివరించారు. ఫ్రాన్స్‌లోని 95 శాతం వ్యాపార సంస్థలు, ఎస్ఎంఈలు ఎంఈడీఈఎఫ్ నెట్‌వర్క్‌లో అంతర్భాగంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని చెప్పారు.
ప్రపంచంలోని అతిపెద్ద క్షిపణివ్యవస్థల తయారీలో పేరొందిన ఎంబీడీఏకు చెందిన అత్యున్నత బృందంతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎంబీడీఏ డైరెక్టర్ బోరిస్ సోలొమియాక్, పాల్‌నీల్ లీ లివెక్‌తో పాటు భారత్, ఆసియా వ్యవహారాలు చూసే సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు జీన్ మార్క్ పీరాడ్ ఈ భేటీలో పాల్గొన్నారు. తయారీ రంగంలో తెలంగాణలో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఎంబీడీఏ బృందాన్ని కేటీఆర్ కోరారు. వరుస భేటీల్లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ‘ఏరోక్యాంపస్ ఎక్వటైన్’సేల్స్ డైరెక్టర్ జేవియర్ అడిన్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఎయిర్ అటాషెగా ఉన్న ఎయిర్ కమెడోర్ హిలాల్ అహ్మద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత రాయబారితోనూ భేటీ
ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావేద్ అష్రఫ్‌తోనూ కేటీఆర్ బృందం భేటీ అయింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయనకు వివరించారు. ఫ్రెంచ్ కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు అవకాశమున్న ప్రాధాన్య రంగాల గురించి మదింపు చేయాలని కోరారు. కాస్మెటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బిచరొవ్‌తో జరిగిన భేటీలో తెలంగాణలో కాస్మెటిక్స్ తయారీకి ఉన్న అవకాశాలపై చర్చించారు.













