వివక్ష చూపిస్తూ కేంద్రం ఝలక్ ఇచ్చింది : ఈటల రాజేందర్
రెమిడేసివిర్ పంపిణీ విషయంలో కేంద్రంపై తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము 4 లక్షల రెమిడేసివిర్ ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని, 21,500 మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెమిడెసివిర్ విషయంలో కేంద్రం షాకిచ్చిందన్నారు. రాష్ట్రానికి సరిపడా డోసులు లేవని, ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా వైద్యం చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా కేటాయింపులు చేస్తున్నారని ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను కేంద్రం తన పరిధిలోకి తీసుకొందని, కేంద్రం తీరు చాలా బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి కేటాయింపులు జరగాలని కోరారు. అయితే రెమిడేసివిర్ను బ్లాక్ లో విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరత లేదన్నారు. రాష్ట్రానికి రోజుకు 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని, కేంద్రం మాత్రం 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేటాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని హెచ్చరించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల కరోనా బాధితులు కూడా హైదరాబాద్కు వస్తున్నారని, చికిత్స పొందుతున్న బాధితుల్లో 60 నుంచి 70 శాతం ఇతర రాష్ట్రాల వారేనని ప్రకటించారు. రోజుకు 30 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే చేయగలమని, పూర్తిగా వీటిపైనే ఆధారపడలేమని స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, జ్వరం వస్తే తప్పకుండా ఆస్పత్రికి వెళ్లాలని, గాంధీలో ఆక్సిజన్ పడకలున్నాయని ప్రకటించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు డబ్బు కట్టడం లేదని రోగులకు గాంధీకి పంపుతున్నాయని, గాంధీలో మొదటి సారి 600 మందికి పైగా ఐసీయూలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, హోం ఐసోలేషన్లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఈటల రాజేందర్ సూచించారు.













