కాంగ్రెస్కు బిగ్ ఝలక్.. బీజేపీ గూటికి మరో నేత
కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ.. పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ముఖ్యంగా నేతలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇతర పార్టీ నేతలు బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అంటే వారిని స్వాగతించేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకుంటూ బలోపేతానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. తాజాగా మరో నేత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. ఢిల్లీలో బుధవారమే బీజేపీ కండువా కప్పుకోనున్నారట. ఆయనెవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు డీకే అరుణ కూడా హస్తినకు వెళ్లారు. శశిధర్ పార్టీ మారబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అదే తరహాలో సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై శశిధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కల్లోలాలకు రేవంతే కారణమని, ఆయన పనులు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని శశిధర్ అన్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్.. రేవంత్ ఏజెంట్లా పని చేస్తున్నారని విమర్శలు చేశారు. తాజాగా బుధవారం సాయంత్రం హస్తినలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.













