బ్రాహ్మణ చేదోడు సంక్షేమ పరిషత్
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’ (టిఎస్బిఎస్పి) అనుకున్న లక్ష్యాల దిశగా పదిచేస్తోందని చైర్మన్ కెవి రమణాచారి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని రాష్ట్రంలోని బ్రాహ్మణులంతా సద్వినియోగం చేసుకోవాలని, కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా నడవాల్సిన అవసరం ఉందని రమణాచారి పేర్కొన్నారు. పేద బ్రాహ్మణులు మరీముఖ్యంగా మహిళలు స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఐదులక్షల రూపాయల వరకు పెట్టుబడిగా ఖర్చయ్యే కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు తదితర యూనిట్లకు 75 శాతం సబ్సిడీగా ఇస్తామని, పదిలక్షల వరకు ఖర్చయ్యే యూనిట్లకు 50 శాతం సబ్సిడీగా ఇస్తామన్నారు. సామూహిక ఉపనయనాలు చేసే సంస్థలు, సంఘాలు ముందుకు వస్తే ఒక్కో వటువుకు 11,116/- రూపాయల చొప్పున ఇస్తామని రమణాచారి తెలిపారు.













