ఉప్పల్ స్కైవాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. ఉప్పల్ కూడలిలో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్ఎండీఏ దీన్ని నిర్మించింది. 600 మీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ స్కైవాక్‌కు మొత్తంగా రూ.25 కోట్లు కేటాయించారు. నాలుగు వైపుల నుంచి నేరుగా ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, రామంతాపూర్ రాహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు ఈ వంతెనను అనుసంధానించారు. మెట్లు ఎక్కలేని వారికోసం ఎస్కలేటర్లు, లిప్టులు ఏర్పాటు చేశారు. స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పిచ్చిన రూఫ్లను ఏర్పాటు చేశారు.













