ఎన్టీఆర్, చంద్రబాబుపై కేటీఆర్, హరీశ్ రావు సెన్సేషనల్ కామెంట్స్..!! ఏంటి సంగతి..?
పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ నేతలకు మించిన వాళ్లెవరూ ఉండరేమో. ఇటీవల చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కేసీఆర్ స్పందించాలంటూ అనేక డిమాండ్లు వచ్చాయి. అయితే ఆ పార్టీ నేతలెవరూ పట్టించుకోలేదు. పైగా చంద్రబాబుకు అనుకూలంగా ఐటీ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపడతామంటే పర్మిషన్ ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం. అది రెండు రాజకీయ పార్టీల మధ్య వార్ అని.. ఏదైనా ఉంటే మీ రాష్ట్రంలో చూసుకోవాలంటూ కేటీఆర్ డైరెక్టుగా చెప్పేశారు. ఇది వివాదాస్పదమైంది. దీంతో ఇప్పుడు సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ నేతలు స్లోగా దిగి వస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును నిరసిస్తూ పలువురు ఐటీ ఉద్యోగులు పలుచోట్ల ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా ర్యాలీ చేపట్టేందుకు ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరారు. అయితే ఇందుకు పర్మిషన్ నిరాకరించింది. దీంతో టీడీపీ నేత నారా లోకేశ్ నేరుగా కేటీఆర్ కు ఫోన్ చేసి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అయితే ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశం కాబట్టి పర్మిషన్ ఇచ్చేది లేదని.. ఏదైనా ఉంటే ఏపీలో చూసుకోవాలని చెప్పినట్లు కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. దీంతో కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి. జాతీయపార్టీ అయిన బీఆర్ఎస్ ఏపీలో, మహారాష్ట్రలో సభలు పెట్టుకోవచ్చు కానీ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలు ర్యాలీ చేయకూడదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ అనేకమంది పోస్టులు పెట్టారు.
కేటీఆర్ వ్యాఖ్యల ప్రభావం సీమాంధ్ర ఓటర్లను ప్రభావం చేస్తుందనుకున్నారో ఏమో.. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇవాళ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరేనన్నారు. ఎన్టీఆర్ పేరులోనే ఏదో మహత్యం ఉందన్నారు. అందువల్లే తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయినట్లు చెప్పారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్ కొడతారన్నారు. కేటీఆర్ నోట ఎన్టీఆర్ మాట రావడం, పైగా ఆయన భజన చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
మరోవైపు మంత్రి హరీశ్ రావు చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ వయసులో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపడం బాధాకరమన్నారు. గతంలో ఆయన ఐటీ ఐటీ అంటూ తిరిగేవారన్నారు. ఇటీవల తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు చెప్పినట్లు హరీశ్ రావు వివరించారు. ఇన్నాళ్లూ చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని డిమాండ్లు వచ్చినా పట్టించుకోని నేతలు ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణలో సీమాంధ్ర సెటిలర్ల ఓట్ల కోసమే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారనే టాక్ నడుస్తోంది.













