రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో ఆపశ్రుతి
కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ కిందపడ్డారు. ముఖానికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కీతో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు. భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు.













