ఆ సీట్లు గెలవకపోతే… నేను గెలిచినా రాజీనామా చేస్తా
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించానని చెప్పుకుంటున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నల్లగొండను ఎందుకు మరచిపోయడని అన్నారు. జిల్లా అభివృద్ధి పట్టించుకోని కేసీఆర్ నల్లగొండలోని 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ 12 సీట్లలో 10 సీట్లు గెలవకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా పదవికి రాజీనామా చేస్తానని సృష్టం చేశారు. మంత్రి వర్గంలో ఒక మహిళా మంత్రిని లేకుండా చేసి, బతుకమ్మ చీరల గురించి కేసీఆర్ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దామరచర్ల ప్లాంట్‌ను ఆపేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 30 వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఎల్బీసీలో కమీషన్ రాదనే పట్టించుకోలేదన్నారు. రౌడీలకు, దోపిడీదారులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, రౌడీలను గెలిపిస్తే నల్గొండలో నిత్యం హత్యలు, దోపిడీలే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీల మహాకూటమిపై నల్లగొండ ఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు.













