సీఎం కేసీఆర్‌లో ఆ భయం కనిపిస్తోంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తన కుమారుడు సీఎం కాలేడనే భయం కేసీఆర్‌లో కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాజా అరెస్టులు చూస్తుంటే అధికారం చేజారిపోతుందేమోనని భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయాలని సీఎం కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి త్వరలోనే తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అని ఆయన గుర్తుంచుకోవాలన్నారు.
ఈడీ, సీబీఐ దాడులు జరిగితే నరేంద్ర మోదీ చేయిస్తున్నారంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ సీబీఐ తన పని చేసుకుంటూ వెళ్తాయని తెలిపారు. ఎవరిపై ఇన్వెస్టిగేషన్ చేయాలనేది మోదీ పని కాదని, ఆయనకు దేశానికి సంబంధించిన చాలా పనులుంటాయని అన్నారు. కేంద్రహోమంత్రి అమిత్ షా ఎన్టీఆర్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించారని చెప్పారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవిని ఆహ్వానించామని గుర్తు చేశారు. సమయం సందర్భాలను బట్టి ఆహ్వానిస్తామన్నారు. అందర్నీ ఒకే సందర్భంగా పిలవలేమని అన్నారు.













