మళ్లీ దరఖాస్తులు ఎందుకు?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసే ఆరు హామీల కోసం అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, ఆ పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.4వేలకు పెంచడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇలా దరఖాస్తులు చేసుకోవాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కవిత తెలిపారు. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకు మాత్రమే ఈ పథకాలు ఇస్తామని కాంగ్రెస్ సర్కారు చెప్పడం ఏమాత్రం సరికాదని కవిత మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత ఈ పథకాలు అమలు చేస్తే మరింత మందికి లబ్ధి చేకూరుతుందని ఆమె సూచించారు. అక్కడితో ఆగకుండా.. ఇప్పటి వరకు రైతుబంధు నిధులను ఎందుకు విడుదల చేయలేదు? అని ప్రశ్నించారు. ‘రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు అసలు దాని గురించే మాట్లాడటం లేదు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే తేడా. ఈ స్వల్ప తేడాతోనే కాంగ్రెస్ గెలిచిందని మర్చిపోవద్దు’ అని ఆమె గుర్తుచేశారు.













