మహిళా దర్బార్ తో మహిళలకు… ఒరిగేదేమీ లేదు
గవర్నర్ మహిళా దర్బార్ పెట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని, ఇది పూర్తిగా రాజకీయమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను రక్షించేవిగా లేవని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానీయకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. లోపాయికార ఒప్పందంలో భాగంగానే టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయని అన్నారు. ఎంఐఎం, బీజేపీ పార్టీలు రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. పాకిస్థాన్ లాంటి పాలన కోసం బీజేపీ పాకులాడుతోందని విమర్శించారు. అన్ని కులాలు, మతాల ప్రజలు పార్టీల బుట్టలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, ప్రధాని మోదీ డైరెక్షన్‌తోనే గవర్నర్ మహిళా దర్బార్ పెట్టారని ఆరోపించారు. మహిళా దర్బార్తో మహిళలకు ఒరిగేదేమీ లేదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు గవర్నర్ చర్యలు తీసుకోలేదన్నారు.













