హైదరాబాద్ కు ఇంటెల్ కేంద్రం
ప్రసిద్ధ సాఫ్ట్వేర్ సంస్థ ఇంటెల్ ఇండియా హైదరాబాద్‌లో తమ సాంకేతిక అభివృద్ధి కేంద్రం (టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.మూడువేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ కేంద్రం ద్వారా మొదటి దశలో 1500 మందికి ఉపాధి కల్పించనుంది. మొత్తంగా అయిదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. సంస్థ భారతదేశ విభాగాధిపతి నివృతిరాయ్ హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. తమ కొత్త సాంకేతికాభివృద్ధి కేంద్ర స్థాపనపై చర్చించారు. త్వరలోనే తమ సంస్థ గ్లోబల్ సీఈవో హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తారని ఆమె తెలిపారు. తెలంగాణలో కంప్యూటర్ సర్వర్లు, ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్ పరికరాల తయారీ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, ఇతర అవకాశాల గురించి మాట్లాడారు. భారత్‌లో తయారీ విధానానికి అనుగుణంగా ఇంటెల్ తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని తెలిపారు.













