పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని, సత్వర అనుమతుల కోసం టీఎస్ఐపాస్ పేరిట చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రమని గవర్నర్ నరసింహన్ అన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర విశేష ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. దేశంలోని రాష్ట్రాలకు పెట్టుబడుల సమీకరణ కోసం విదేశీ వ్యవహరాల శాఖ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా లావోస్, సీషెల్స్, ఫిన్లాండ్, పెరూ దేశాలకు చెందిన రాయబారులు రవిశంకర్, ఔసద్ సయీద్, వాణీరావు, సుబ్బరాయుడులు రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. తెలంగాణ పెట్టుబడులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల రాష్ట్రం. పెట్టుబడుల సమీకరణ కోసం రాయబారుల పర్యటనలు చేపట్టడం అభినందనీయం. నిరంత విద్యుత్, ఇంటింటికీ రక్షిత నీటిని అందించేందుకు మిషన్ భగీరథ, వైద్యరంగంలో మెరుగైన సేవలు, విద్యారంగంలో సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాజధానిలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి అని గవర్నర్ అన్నారు.













