హైదరాబాద్ లో స్మార్ట్ అర్బనేషన్ సదస్సు
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికవుతోంది. ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు స్మార్ట్ అర్బనేషన్ పేరుతో ఐదో స్మార్ట్ సిటీ సదస్సు నిర్వహిస్తున్నట్టు స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎస్‌సిసిఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతాప్ పడోడె తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి 1,500 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారు. నలభైకి పైగా స్టార్టప్ కంపెనీలు కూడా ఈ సదస్సులో స్మార్ట్ సిటీస్‌కు సంబంధించి తమ సరికొత్త ఆలోచనలను ఈ సదస్సులో ఆవిష్కరించబోతున్నాయి. స్మార్ట్ సిటీల అభివృద్ధిలో ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై 50 మందికిపైగా ప్రముఖుల ప్రసంగాలూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుతో 30 శాతం వరకు ఇంధనం ఆదా అవుతుందని పడోడె చెప్పారు. ఆయా నగరాల పౌరులు సిద్ధంగా లేకపోతే ఏ నగరాన్నీ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. మన దేశంలో కొన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను రాంకీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వివరించారు.













