GHMC: జీహెచ్ఎంసీ మేయర్ తో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల భేటీ
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) తో నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), అరికెపూడి గాంధీ, ప్రకాశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో కలిసి కార్పొరేటర్లు మేయర్‌ను కలిశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై ఆమెతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఏ ప్రాతిపదికన డివిజన్ల (Divisions) పునర్విభజన చేశారో చెప్పాలని కోరామన్నారు. బృహత్ హైదరాబాద్ డివిజన్ల పునర్విభజనకు ఆదేశాలిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగరాన్ని 300 డివిజన్లుగా విభజించారు. ఆయా డివిజన్లకు హద్దులను ప్రకటిస్తూ కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. గతంలోని డివిజన్లలో పోలిస్తే పాత జీహెచ్ఎంసీలోని డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యాయి. కొన్నిచోట్ల హద్దులు, కొత్త డివిజన్లపై జీహెచ్ఎంసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ మేయర్‌ను కలిశారు.





