హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మకమైన సదస్సు
రాష్ట్ర రాజధాని కేంద్రంగా మరో ప్రతిష్టాత్మకమైన సదస్సు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం, పరిశుభ్రతకు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో భారీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్ ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌సీసీ) వేదికగా మూడు రోజుల పాటు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2019 నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హరితహారం పేరుతో కోట్లాది మొక్కులు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా మారినందున ఈ సదస్సు రాష్ట్ర ప్రతిష్టను మరింతగా పెంచుతుందని ఇక్కడి పరిశ్రమలశాఖ భావిస్తోంది. దేశంలో ఆ దిశగా నిబద్ధతను చాటుకుంటున్న వ్యక్తులు, సంస్థలు, పట్టణాలు, నగరాలు, ప్రభుత్వాలను గుర్తించి అవార్డులు కూడా అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్‌సిటీల నిర్మాణం క్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే పట్టణ గృహ సముదాయాల్లో ఏ మేరకు గ్రీనరి ఉండాలన్న అంశంపై పర్యావరణవేత్తలు, నిపుణులు తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తారు.













