పీఆర్సీకి ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి, చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి మానిటరీ బెనిఫిట్‌ను, ఏప్రిల్ నుంచి క్యాష్ బెనిఫిట్‌ను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని ఆర్థిక శాఖా కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పెన్షనర్లకు ఏప్రిల్ 2020 నుంచి మే 2020 వరకూ చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించాలని కూడా నిర్ణయించింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్‌ఆర్‌ఏ మీద ఉన్న పరిమితిని ఎత్తేయాలని కేబినెట్ నిర్ణం తీసుకుంది.
ప్రజా పంపిణీ వ్యవస్థ పరిష్కార మార్గాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమిషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సలహాలు, పరిష్కార మార్గాల కోసం ఓ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు హరీశ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో న్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆస్పత్రుల నిర్మాణం
సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆస్పత్రులను నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సూర్యాపేటలో ఉన్న 50 పడలక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడలకు పెంచాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ఆస్పత్రుల్లో రోగుల సహాయార్థం వచ్చే వారి వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్స్ కేంద్రాలతో పాటు మిగితా అన్ని జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎలర్జీ జబ్బుల ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.