జేపీ నడ్డాతో భేటీ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈటలతో పాటు టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా నడ్డాతో భేటీ అయ్యారు. ఈటలతో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ఉన్నారు. అతికొద్ది రోజుల్లోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. వాస్తవానికి కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈటలను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యూహాన్ని ఇప్పుడే వద్దనుకున్నట్లు తెలుస్తోంది. ఈటల బీజేపీలో అధికారికంగా చేరే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన విషయాలను ఈటల రాజేందర్ తన ఆంతరంగికులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించనున్నారు. మరోవైపు ఈ భేటీ సందర్భంగా ఈ నేతలందరూ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జేపీ నడ్డా దృష్టికి తీసుకొచ్చారు.