ఇది చాలా దారుణం.. తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం
బీజేపీలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రికే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు ఏకపక్షంగా టీఆర్ఎస్కు సహకరించటం సరికాదన్నారు. బీజేపీలో చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయానలి చూస్తున్నారు. ఇది చాలా దారుణం. వేల సంఖ్యలో ఎంపీటీసీలు, వందల సంఖ్యలో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసి బీజేపీలో చేరే నాయకులను ఆపలేరు. ఎల్లకాలం మీరే అధకారంలో ఉండరు. టీఆర్ఎస్లో ఉన్ననని రోజులు ఎలాంటి కేసులు, వేధింపులు లేవు అన్నారు.
చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరగానే అర్థరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారు. కేసులు పెట్టి భయపెడుతున్నారు. మీరు చేసిన తప్పులన్నీ లెక్క పెడుతున్నాం. తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం. కూలి పని చేసుకుని జీవనం సాగించే బీజేపీ కార్యకర్తలను కూడా వదలట్లేదు. వివిధ రకాలుగా వారిని వేధింపులకు గురి చేసి లొంగీదీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు.













