ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే
హుజురాబాద్ ప్రజలు తన వెంటే ఉన్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్లర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. హుజురాబాద్ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేసి అనేక ప్రలోభాలకు గురి చేశారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన తొనకకుండా జంకకుండా అండగా హుజురాబాద్ ప్రజానీకం నిలిచిందన్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిరదని, రాజీనామా చేసిన ఐదు నెలలు అయిందని అన్నారు. ఐదు నెలల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నుంచి అరడజను మంది మంత్రులు హుజురాబాద్ మీద పడ్డారని విమర్శించారు.
హుజురాబాద్లో సర్పంచ్లు ఇతర ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల మీద నమ్మకము లేదని, సిద్దిపేట, ఇతర ప్రాంతాల నుంచి జనాలి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే , పెన్షన్ రావాలంటే టీఆర్ఎస్కు ఓటు వేయాలని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు రావాలంటే టీఆర్ఎస్ జెండా కట్టాలని, ఆశ వర్కర్, ఏఎన్ఎమ్ల కుటుంబ సభ్యులు వేరే పార్టీలతో తిరగవద్దని హుకుం జారీ చేశారని మండిపడ్డారు. తాను చేసిన 18 సంవత్సరాల సేవ ఇప్పుడు కనబడుతుందని తెలిపారు. బెదిరింపులు, కుట్రలతో హుజురాబాద్ ప్రజలను ఏమీ చేయలేరని అన్నారు.













