ఇది నిజమా? కాదా? అనేది ప్రజలే చెప్పాలి : ఈటల
దళితబంధు పథకం అమలును అడ్డుకుంటున్నానంటూ తనపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను దళితబంధును అడ్డుకుంటున్నట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్‌వి కేవలం ఎన్నికల మాటలే తప్ప చేతలు కావన్నారు. దళితబంధు పథకానిన రాష్ట్రం మొత్తం అమలు చేసే సత్తా లేకనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఎన్నికల సమయంలోనే ఎస్సీలు, నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని విమర్శించారు. ఈటల సీఎం కేసీఆర్ కుర్చీ మీద కన్ను వేసిండు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేశాడని మంత్రి హరీశ్‌రావు అంటున్నారు. ఇది నిజమా? కాదా? అనేది ప్రజలే చెప్పాలి అన్నారు.
కుడి భుజం, తమ్ముడు అని పిలిపించుకున్న నేను ఇవాళ దెయ్యాన్ని ఎలా అయ్యానో సీఎం చెప్పాలన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చాను. అదే కేసీఆర్‌కు నచ్చలేదన్నారు. కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితమైతే నేను ఆస్పుత్రులకు తిరిగాను. అసత్య ప్రచారాలు చేస్తూ రోజుకో దొంగ ఉత్తరం పుట్టిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారన్నారు. దళితబందు వద్దని నేను లేఖ రాసినట్టు నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. దళితబంధు ప్రకటించి 70 రోజులు అయింది. ఇప్పటి వరకు ఎందుకు అందరికీ అందించలేదన్నారు. ఈటల రాజేందర్ మేలు చేస్తాడే కానీ కీడు తలపెట్టడు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి. సంపన్నులకు కాదని కాట్లాడిన వాడిన్నేను. అవన్నీ అడిగితే నన్ను పార్టీ ఉంచి బయటకు పంపించారు అని ఈటల అన్నారు.













