ప్రభుత్వం కొనసాగితే తెలంగాణకే అరిష్టం : ఈటల ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఉద్యమంలో తమలాంటి వారు లేకపోతే, కెప్టెన్ ఎక్కడుండేవారని సూటిగా ప్రశ్నించారు. కెప్టెన్ ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకపోతే కెప్టెన్‌కు పేరు ప్రఖ్యాతులు వచ్చేవా? అని నిలదీశారు. తన డీఎన్ఏపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారని, అది అప్రస్తుతం అని అన్నారు. దానిని పక్కన పెట్టాలని, తెలంగాణలో మరో ఆత్మ గౌరవ పోరాటం కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆత్మగౌరవ పోరాటమని, ప్రతీక అని ప్రకటించారు. బీజేపీలో చేరినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని, 20204 లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే తెలంగాణకే అరిష్టమని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించే వరకూ నిద్రపోవద్దని తెలంగాణ సమాజం భావిస్తోందని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలుంటాయని ప్రజలెవ్వరూ అనుకోలేదని, ఈ ప్రభుత్వానికి ఘోరీ కట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.













