తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం …మైకులు మూగబోయాయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగించాలనే ఎన్నికల సంఘం నిబంధన కారణంగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడిరది. మైకులన్నీ మూగబోయాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. గత కొన్ని రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి గెలిచిన హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్, కర్ణాటక ఎన్నికల్లో గెలిచి మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎలాగైనా అధికారం హస్తం గతం చేసుకోవాలని ఆరు గ్యారంటీలతో ప్రచారం నిర్వహించింది. మరో వైపు అధికారమే లక్ష్యంగా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ఇక రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియగా, 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగిసింది. ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి.













