కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఈ పథకాలను
ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. దేశంలో వైషమ్యాలు సృష్టించి అభివృద్ధికి ఆటంకాలు కల్పించడం తగునా? అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయింది. మత విద్వేషాల పేరుతో బీజేపీని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో రూ.4వేల పింఛన్ ఇస్తున్నారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేస్తున్నారా? కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అక్కడ ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు మూడు గ్యారంటీలు ఇవ్వాలి. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరని, కుంభకోణాలు చేయబోమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమని గ్యారంటీ ఇవ్వాలన్నారు.
మహిళలను గౌరవించే అలవాటు కేసీఆర్‌కు లేదు. బీఆర్ఎస్ కమిటీల్లో ఎక్కడైనా మహిళలకు కీలక బాధ్యత ఉందా? పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులో నా శ్రమ కూడా ఉంది. ఆ ప్రాజెక్టు కోసం కృషి చేసిన నన్ను గౌరవించకుండా ఇష్టానుసారం మాట్లాడున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తోడు దొంగలు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.













