కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే.. బీజేపీ పెద్దలకు దోచి పెడుతోంది: డిప్యూటీ సీఎం భట్టి

కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బీజేపీ కొద్దిమంది పెద్దల కోసం దేశాన్ని దోచి పెడుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచన చేస్తుందని, కానీ బీజేపీ మాత్రం ఇప్పటివరకు పేదలకు రూపాయి కూడా ఇవ్వకపోగా.. అదానీ, అంబానీలకు రూ.16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని విమర్శలు గుప్పించారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కోట్కాపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఆరోగ్య బీమాకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇదే పథకాన్ని దేశ వ్యాప్తంగా కూడా అమలు చేస్తాం. అలాగే ఇండియా కూటమి అధికారంలోకి రాగానే తమిళనాడులో అమలులో ఉన్న 69 శాతం రిజర్వేషన్ల విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తాం’’ అని డిప్యూటీ సీఎం భట్టి చెప్పుకొచ్చారు. అలాగే మోదీ పదేళ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని, దేశాన్ని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలంటే ఇండియా సర్కార్ అధికారంలోకి రావాల్సిందేనని భట్టి పేర్కొన్నారు.