కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేసీఆర్, మోదీ కుట్రలు: తెలంగాణ కాంగ్రెస్ నేతలు
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై వెంటనే దర్యాప్తు జరపాలంటూ డీజీపీ రవి గుప్తాకు తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు కైలాష్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బీజేపీ, కేసీఆర్ ఇద్దరూ కూడా డబ్బులు ఎర చూపించి, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేలాష్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీ రాజా సింగ్, బీఆర్ఎస్ నేతలు కడియం శ్రిహరి, పల్లె రాజేశ్వర్ మాట్లాడుతూ ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని అంటున్నారు’ అని కైలాష్ అన్నారు. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ కలిసి తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 సీట్లు నెగ్గి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.













