వెంకయ్య ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణం : కేసీఆర్
నిన్నటి వరకు మనలో ఒకరిగా ఉన్న వెంకయ్యనాయుడు ఈ రోజు ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్భవన్లో వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున వెంకయ్యకు సీఎం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడుకు సన్మానం చేయడం తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. చాలామంది అనేక పదవులు అనుభవిస్తారు కానీ వెంకయ్యనాయుడిలా పదవికి వన్నె తెచ్చే నేతలు కొందరే ఉంటారు అని అన్నారు. జాతీయస్థాయికి ఎదిగినా మూలాలు మరిచిపోని మనిషి ఆయన. రాజకీయాల్లో ఉన్నతస్థాయికీ ఎలా చేరాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఉపరాష్ట్రపతి కావడం సామాన్య విషయం కాదు. నేటితరం రాజకీయ నేతలకు ఆయన ఆదర్శం అని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి, తెలుగు భాషకు గౌరవం దక్కిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశంలోనే వెంకయ్య అద్భుతమైన వక్త అని కొనియాడారు. తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి కావడం తెలుగు భాషకే గర్వకారణమన్నారు. తెలుగు ఒక్కటే కాదు ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడే వ్యక్తి వెంకయ్య అని తెలిపారు.













