యాదాద్రిలో మహాసుదర్శన యాగం
యాదాద్రి ప్రధాన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో 1008 కుండాలతో మహాసుదర్శన యాగం జరిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రపంచ వైష్టవ పీఠాలన్నింటినీ ఆహ్వానించి ఈ క్రతువును చాలా అద్భుతంగా నిర్వహిస్తామని తెలిపారు. భగవంతుడిని పూజించే సంస్కారం తల్లిదండ్రుల నుంచే తనకు వచ్చిందని, తన బాల్యం వైష్టవ సంప్రదాయంలో గడిచిందని గుర్తు చేస్తున్నారు. గురువులు సంస్కారవంతంగా తీర్చిదిద్దారని తెలిపారు. హైందవం చాలా బలంగా ఉందని, దానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని జీయర్ ఆశ్రమంలో జరిగిన చినజీయర్ స్వామి తిరునక్షత్ర (పుట్టినరోజు) వేడుకలను సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ, మనవడు హిమాన్ష్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెదజీయర్ స్వామిపై రచించిన సత్య సంకల్ప పుస్తకాన్ని చినజీయర్ స్వామి కేసీఆర్‌కు అందజేశారు. కేసీఆర్ దంపతులను శాలువాలతో సత్కరించి, ఆశీర్వచనమిచ్చారు.













