ఎర్రవల్లిలో రాజశ్యామల యాగం పరిసమాప్తం
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం విశాఖ శ్రీశారదాపీఠం ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పరిసమాప్తమైంది. యాగంలో మంత్రించిన జలాలను రుత్వికులు కేసీఆర్ దంపతులపై చల్లారు. యాగభస్మాన్ని కేసీఆర్ నుదటదిద్ది ఆశీర్వచనాలు అందించారు. రాజశ్యామల అమ్మవారు నర్తనకాళీ అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణేశ్వర మూల మంత్ర హవనాలను మొదలు పెట్టి పూర్ణాహుతి ముహూర్త సమయానికి నిర్దుష్ట సంఖ్యలో పూర్తి చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి పాదపూజ చేసి పుష్పాభిషేకంతో కేసీఆర్ గురువందనం సమర్పించారు. ఈ సందర్భంగా శూలినీ దుర్గ కవచంతో అభిమంత్రించిన రక్షను స్వరూపానందేంద్ర స్వామి కేసీఆర్కు కట్టారు. విశాఖ నుంచి ప్రత్యేకంగా తెప్పించి రాజశ్యామల అమ్మవారి శేష వస్త్రాలను కేసీఆర్ దంపతులకు అందించారు. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారని స్వరూపానందేంద్ర స్వామి ఈ సందర్భంగా తెలిపారు.













