అంతర్జాతీయ అర్బిట్రేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్ కు మరింత పేరు: ఎన్.వి.రమణ
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) శాశ్వత భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఐఏఎంసీ ట్రస్ట్ రూపకర్త జస్టిస్ ఎన్.వి.రమణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ కొనసాగుతోందన్నారు. గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించినందుకే కేసీఆర్‌కు ధన్యవాదాలు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుందన్నారు. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ సమయానికి నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నా అని అన్నారు.
ఐఏఎంసీ ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌కు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని, అంతే త్వరగా దానికోసం ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. మధ్యవర్తిత్వం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని నాతోపాటు కేసీఆర్ కూడా నమ్ముతారని తెలిపారు. ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించారని సీజేఐ వెల్లడిరచారు. హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉన్న 3.7 ఎకరాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.













