తెలుగు రాష్ట్రాల సీఎస్ల సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్రెడ్డిల ఆదేశాలకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేశ్‌కుమార్, నీలం సహానీలు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం లోని తొమ్మిది, పదో షెడ్యూల్డు సంస్థల విభజనపై చర్చించారు. రెండు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విభాగం ఉన్నతాధికారులైన రామకృష్ణారావు, ప్రేమ్ చంద్రారెడ్డి ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ సహా 20 సంస్థలలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపుపై ఏకాభిప్రాయం కుదిరింది. త్వరలోనే జరిగే మరో సమావేశంలో మిగిలిన సంస్థల విభజనపై చర్చించి, ప్రతిపాదనలు సిద్దం చేసి, ముఖ్యమంత్రుల ఆమోదానికి సమర్పించాలని నిర్ణయించారు.
తదుపరి సమావేశం ఆంధ్రప్రదేశ్‌లో జరపాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. చర్చల సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, మున్ముందు ఇదే ధోరణిని కొనసాగిస్తామని సమావేశం అనంతరం ఇద్దరు సీఎస్‌లు తెలిపారు.













