‘ఖమ్మం’ టెన్షన్
ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభ అధికార బీఆర్ఎస్లో ఆందోళన కలిగిస్తోందా? సభను టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారా? రాహుల్ సభతో కాంగ్రెస్ దూకుడు మరింత పెరగనుందా? ఖమ్మం నుంచి కాంగ్రెస్ శంఖారావంతో ఎలాంటి పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కీలకనేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .. కాంగ్రెస్‌లో చేరడంతో ఖమ్మం చేజారే పరిస్థితి ఉందని గులాబీ పార్టీ భావిస్తోందా?
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలకనేత.. జిల్లా అంతటా పొంగులేటి అనుచరులున్నారు.అంతే కాదు.. గట్టి అనుచరవర్గం ఉన్న నేత కూడా. అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో… ఆయన అనుచరులు హస్తం గూటికి చేరకుండా చూసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వచ్చాయి. పొంగులేటి సైతం బ్యానర్ చూపిస్తూ.. తమను ఎవ్వరూ బెదిరించలేరన్నారు
ఓవైపు ఇప్పటికే భట్టి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరోవైపు పొంగులేటి సైతం చేరుతుండడంతో.. కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగురనీయనని పొంగులేటి ఇదివరకే శపథం చేశారు. ఖమ్మంలో గులాబీ పార్టీకి నూకలు చెల్లాయని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు.. పొంగులేటి అనుచరులు గులాబీ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈపరిణామం జిల్లాలో పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని ఆపార్టీనేతలు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు
ఓవైపు ఖమ్మంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్.. ఒంటెద్దుపోకడలతో ముందుకెళ్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే హైకమాండ్‌కు దగ్గరగా ఉండడంతో.. ఎవరూ బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తగూడెంలో ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ తీరుతో.. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతీరుపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించి, ముందుకెళ్లాలంటే.. మరోసారి మునుగోడు మ్యాజిక్ చేయాల్సి ఉందని బీఆర్ఎస్ యోచిస్తోంది. అక్కడెలాగైతే కమ్యూనిస్టుల మద్దతుతో గట్టెక్కారో.. మరోసారి అదే స్ట్రాటజీ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.













