ఐటీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ? : రఘునందన్
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వందల ఐటీ కంపెనీలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. భూ రికార్డుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని అన్నారు. డీఎల్ఎఫ్ రెండో యూనిట్ హైదరాబాద్ రాకుండా కేటీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేతకాని తనంతోనే అతిపెద్ద ఐటీ కంపెనీ వేవ్‌రాక్ హైదరాబాద్‌ను వీడిందన్నారు. 2011లో రామాంతపూర్‌లో కట్టిన ఐటీ పార్క్‌కు కేటీఆర్ ఎందుకు వెళ్ళరు? అని ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ కొంపల్లిలో కడ్తామన్న ఐటీ కంపెనీ ఎక్కడ అని నిలదీశారు. వరంగల్, కరీంనగర్ లో ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన స్టార్టప్ కంపెనీలు ఐఎస్బీ, ఐఐటీ, ఐఐఐటీ వల్లే వచ్చాయన్నారు. 2014 జూన్ 2 తరువాత టీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం చేసుకున్న కంపెనీల షేర్లను చెప్పాలని డిమాండ్ చేశారు.













