ప్రజల దృష్టి మరల్చేందుకే .. టీఆర్ఎస్ రాజకీయం
తెలంగాణ వ్యతిరేకిగా బీజేపీపై ముద్రవేయడం కేసీఆర్ తరం కాదని బీజేపీ నేత మురళీధరరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ ధాన్యం అంశాన్ని రాజకీయం చేస్తోందని మండ్డిపడ్డారు. ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తే తమ పార్టీ తెలంగాణలోని గ్రామాల్లోకి వెళ్తోందని తెలిపారు. ధాన్యం సేకరణలో కేసీఆర్ కుట్రను ప్రజల ముందుంచుతామన్నారు. ఢిల్లీ వర్సెస్ కేసీఆర్ అనే విధంగా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 8 ఏళ్లుగా ధాన్యం ఎవరు కొంటున్నారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. అగ్రిమెంట్ ప్రకారం ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధమని పేర్కొన్నారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని ఒప్పుకొని సంతకం చేశారో లేదో టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసి రైతుల్లో వ్యతిరేకత పెంచే కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.













