ఫిబ్రవరి 24 నుంచి బయో ఏషియా సదస్సు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బయెఏషియా 2023 సదస్సును నిర్వహించనున్నది. ప్రతి ఏటా నిర్వహించే ఈ సదస్సు కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్ అనే అంశాన్ని ఎంచుకున్నారు. సదస్సులో కొవిడ్ అనంతరం జీవశాస్త్రాల రంగం, నూతన అభ్యాసాలు, సవాళ్లు , అవకాశాలపై జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ప్రసంగించనున్నారు. ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రెగ్యులేటరీ బాడీ ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యారంగ ప్రముఖులు పాల్గొననున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సదస్సులో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డ్టార్ సౌమ్య స్వామినాథన్, నొవార్టిస్ సీఈవో డాక్టర్ వాస్ (వసంత్), అమెరికా నేషనల్ మెడల్ ఆఫ్ పైన్స్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్, యూకే లోని సీఈపీఐ సీఈవో డాక్టర్ రిచర్డ్ హాట్చెట్, రెసిలెన్స్ సంస్థ సీఈవో రాహుల్ సింఫ్వీు, మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగరీ మూర్, షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ప్రొఫెసర్ సర్పరాజ్ కే నియాజీ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సమిత్ హిరావత్, ఎఫ్‌డీఏ ఇండియా కంట్రీ డైరెక్టర్ డాక్టర్ సారా మెక్‌ముల్లెన్, స్విట్జర్లాండ్‌కు చెందిన శ్యామ్ బిషెన్ తదితరులు ప్రసంగించనున్నారు.













