సీఎం కేసీఆర్ పతనం మొదలైంది : బండి సంజయ్
గతంలో జాతీయ పార్టీలు కాదు, ప్రాంతీయ పార్టీలే ముఖ్యమని సీఎం కేసీఆర్ అన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం కేసీఆర్ ఏమీ ఉద్దరించేది లేదన్నారు. కేసీఆర్ పతనం మొదలైందన్నారు. సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు, దేశ వ్యతిరేక భావజాలన్ని యువత గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ రోజు దేశాన్ని ఏలేందుకు సీఎం ఏవో ప్రయత్నాలు చేస్తున్నారని, అవన్నీ కలలుగానే మిగిలిపోతాయన్నారు. ఆయన అవినీతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాంగానే ఇవాళ దేశ రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతిపరుడు, ఆయన కుటుంబం అంతా అవినీతిలో కూరుకుపోయిందని దేశమంతా తెలుసునన్నారు. ఇవాళ రాష్ట్రంలో కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బంగారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పి ప్రజాధనాన్ని పూర్తిగా దోచుకున్నారని విమర్శించారు.













